గోదావరి... చాలా హాయిగా ఉంది
***** చాలా బావుంది. తప్పక చూడండి.
కళ్ళు మూసుకుని మీరొక దృశ్యాన్ని ఊహించుకోండి. పాపికొండల నడుమ మెలికలు తిరిగిన గోదారి మీద తేలుతూ ఒక పడవ. ఆ పడవలో చిన్నాపెద్దా, పిల్లా మేకా భద్రాద్రికి ప్రయాణం... రెండు రోజులు, మూడు రాత్రులూ.. ఉదయాన్నే నునువెచ్చని ఎండలో చల్లటి గాలి తెమ్మెరలు మిమ్మల్ని పలకరిస్తే, చీకటి పడ్డాక వెన్నెల్లో గోదారి అందాలు పరవశంలో ముంచెత్తుతాయి. పడవలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకమైన మనస్తత్వం. వాళ్ళలో మరదలి వల్ల మనసు విరిగిన ఒక అబ్బాయికి పెళ్ళి పేరుతో తన స్వేచ్చకు సంకెళ్ళు పడతాయని భావించే ఒక అమ్మాయి పరిచయం. అది కాస్తా బలపడి ప్రేమగా మారే వైనం. అంతలోనే ఇక్కట్లు, అడ్డంకులు... వాటిని వాళ్ళిద్దరూ అధిగమించి ఒకటయ్యే కథ.
ఆ... అబ్బో.. చాలా చూసాం ఇలాంటి సినిమాలు. ఈ పాటి కథలో కొత్తదనమేముందీ అనుకుంటున్నారా? ఐతే మీరు గోదావరి చూసి తీరాల్సిందే. పైన చెప్పిన చిన్నపాటి కథను రెండుమ్ముప్పావు గంటల అందమైన చిత్రంగా మలచిన ఘనత దర్శకుడు శేఖర్ కమ్ములదే.
ఈ సినిమాకు కాస్టింగ్ చేసిందెవరో గాని నటినటులను పర్ఫెక్టుగా ఎంపిక చేశారు. 'ఆనంద్' లాగే ఈ సినిమాలోనూ పాత్రలన్నీ జీవం ఉట్టిపడుతూ సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి... ఆఖరికి కుక్క పాత్రతో సహా! దాదాపు రెండు గంటల సేపు లాంచి మీదే గడిచే కథనంతో ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా సినిమా తీయడం అందరితరం కాదు.
శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే మ్యాజిక్ గోదావరిలోనూ పని చేసింది. మమూలుగా వచ్చే హీరో-విలన్ కాన్సెప్టుకు భిన్నంగా మనస్తత్వాల సంఘర్షణ ముఖ్యాంశంగా సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ముల తనదైన ముద్ర వేస్తున్నారు. ఇందుకు కావలసిన లోతైన అవగాహన, పాత్ర చిత్రణలో అద్భుతమైన శ్రద్ధ గోదావరిలో (ఇంతకు ముందు ఆనంద్ లో కూడా) ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఈ చిత్రంలో సీత-శ్రీరాం-రాజి పాత్రల మధ్య సంభాషణలు, అంతర్లీనంగా జరిగే సంఘర్షణను మలచిన తీరు చూస్తే చాలు దర్శకుడి ప్రతిభ అర్థమవడానికి. మిగతా అంతా బోనస్ అనుకోండి.
పాత్రలు:
శ్రీరాం: ఈ సినిమా చూసాక సుమంత్ కాకుండా ఈ పాత్రకు ఇంకెవరు సరిపోతారా అనుకోకుండా ఉండలేం.శ్రీరాం పాత్రకు అతికినట్టు సరిపోయాడు సుమంత్. ఏ మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా నటించాడు. హీరో అంటే 'ఒక వెధవ' అయ్యుండాలని ఈ మధ్య ఒక కొత్త ఫ్యాషన్ మొదలైంది కదా. అదృష్టవశాత్తూ ఈ చిత్రంలో కథానాయకుడు వెధవ కాదు. శ్రీరాం పాత్ర నేటి తరానికి అంతగా పట్టని ఉదాత్తమైన, పరిపూర్ణమైన, ఉన్నతమైన వ్యక్తిత్వం ఒన్న ఆదర్శ పురుషుడి పాత్ర. అలా అని నేల విడిచి సాము చేసే తరహాలో లేకుండా మనం సులభంగా ఐడెంటిఫై చేసుకొనేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. మరదలి ప్రేమ కోసం తాపత్రయపడే మామూలు యువకుడి నుంచి ఉన్నతాదర్శాలున్న, లోతైన మనస్తత్వం ఉన్న వ్యక్తిగా శ్రీరాం పాత్రను దర్శకుడు ఎలివేట్ చేసిన తీరు చాలా బావుంది.
సీత: శేఖర్ కమ్ముల ఎంత స్త్రీ పక్షపాతో సీత పాత్రను చూస్తే తెలిసిపోతుంది (శేఖర్ గారూ, వింటున్నారా?:) కమలిని ముఖర్జీ సీత పాత్రలో బహుచక్కగా ఇమిడిపోయింది. అమ్మాయిల గురించి దర్శకుడు చాలా పెద్ద పరిశోధనే చేసినట్టున్నాడు. సంప్రదాయాన్ని, ఆధునికతను మేలవించిన నేటి అందమైన తెలుగమ్మాయి ఎవరంటే ఒక రూప, ఒక సీత అని టకీమని చెప్పేంత బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలను శేఖర్ కమ్ముల తెరపై సృష్టించారు. సీత అమాయకత్వం, గడుసుదనం, కోపం, కరుణ, ప్రేమ, ఉక్రోషం... ప్రతి భావాన్నీ కవితాత్మకంగా పలికించింది కమలిని. సినిమా చివరిలో శ్రీరాంతో " ఇదిగో... నిన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్ళి చేసుకొమ్మని నేను మొదట చెప్పలేదు. నువ్వే మొదట అడిగావ్... సరేనా" అని ఇంతేసి కళ్ళేసుకుని అమాయకంగా, గడుసుగా, బేలగా అంటూంటే ఆ అమ్మాయిని ప్రేమించని మగాడుంటాడా....
రాజి: ఉత్తరాది అమ్మాయి నీతూ చంద్ర (హిందీ చిత్రం 'గరం మసాలా' ఫేం) ఈ పాత్రకు జీవం పోసింది. మమూలుగా బాలీవుడ్ తారలకు తెలుగమ్మయిలకు మధ్య బాడీ లాంగ్వేజి లో కొట్టొచ్చినట్లు కనపడే తేడా ఈ అమ్మాయి విషయంలో కించిత్తు కూడా కనపడలేదు. రాజి పాత్రలోని ఎటూ తేల్చుకోలేనితనాన్ని, అయోమయాన్ని తన కళ్ళతో చక్కగా పలికించింది.
ఇతరులు: చిన్న పిల్లాడి వేషం వేసిన కుర్రాడు అద్భుతంగా నటించాడు. అసలు ఆ పాత్రే ఒక విశేషం ఈ సినిమాలో. కుక్క పాత్ర మరో హైలైట్. కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది శేఖర్ కమ్ముల అట (భవిష్యత్తులో పూర్తి నిడివి గల యానిమేషన్ చిత్రం చేస్తారని ఆశిద్దాం). చాలా చక్కగా ఉన్నాయి కుక్క డైలాగులు. మనుషులకు కనువిప్పు కలిగించేంతగా... రాజికి కాబోయే భర్తగా కమల్ కామరాజు, లాంచి కెప్టెనుగా తనికెళ్ళ భరణి, సీత తండ్రిగా నరసింహారావు చక్కగా నటించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పాత్రకు తనదైన స్వభావం, వ్యక్తిత్వం ఉంటాయి.
చక్కటి సన్నివేశాలు:
1. రాజి పెళ్ళిచూపుల తర్వాత ఇరానీ కేఫ్ లో శ్రీరాం, రాజిల సంభాషణ. శ్రీరాం రాజితో 'నీకు నేనంటే ఇష్టమే కదా మరి పెళ్ళిచూపులకు ఎందుకు ఒప్పుకున్నావ్' అని మొదటి సారి అన్నప్పుడు నమ్మకం, నిష్టూరం ధ్వవిస్తే మూడో సారి 'నేనంటే నీకు...ఇష్టమే కదా' అనేటప్పటికి అది కాస్తా అపనమ్మకం అవుతుంది. తనెంతగానో ఇష్టపడ్డ మరదలు తన కళ్ళ ముందే ఇంకొకరి సొంతమవుతున్నప్పుడు శ్రీరాం కళ్ళల్లో కనిపించే నిస్సహాయత, ఉద్వేగం, ప్రేక్షకులు తామే అనుభవించినట్లు ఫీలవుతారు.
2. శ్రీరాంని మెప్పించాలని సీత చీర కట్టుకుని అతని కోసం ఎదురు చూసే సన్నివేశం
3. గాయపడ్డ శ్రీరాం పడుకుని సేదదీరుతుండగా పక్కన టిపికల్ బాపు అమ్మాయిలా మోకాలికి చుబుకాన్ని ఆనించి కూర్చుని 'రామచక్కని సీతకు...' అని సీత పాడే సన్నివేశం బాపుకు అసలు సిసలు ట్రిబ్యూట్ లా ఉంది.
4. సరిగ్గా తన మనసులోని మాటను చెప్పాలనుకున్న రోజే రాజితో శ్రీరాం పెళ్ళికి ఒప్పుకున్నాడని తెలిసి సీత మనోవేదన పడే సన్నివేశం. తన రాముడు తప్పెలా చేశాడని మథన పడి, ఆ విషయం జీర్ణించుకోలేక సీత తపన పడే సన్నివేశాలు.
5.వస్తానన్న శ్రీరాం రాకపోయేసరికి రాజి తన స్వభావసిద్ధమైన అయోమయాన్ని, చిరాకును ప్రదర్శిస్తూ మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయే సన్నివేశం, ఆ సమయంలో సీత, రాజి ల మధ్య సంభాషణ
6. బెలూన్ల కుర్రాడికి శ్రీరాం ఊరికే డబ్బివ్వబోతే 'నేను ముష్టివాణ్ణి కాదని' వాడు తిరస్కరించే సీను; పుల్లట్లు వేసే పుల్లమ్మ అట్టు ఊరికే ఇవ్వబోతే 'నేను కూడా నీ తమ్ముడిలాంటి వాణ్ణే. ఊరికే నాకొద్దు' అని వెళ్ళిపోయే సన్నివేశం. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం అనే గుణాలకు పేదా - గొప్పా, చిన్నా - పెద్ద భేదాలుండవని చెప్పే చక్కటి సన్నివేశాలు ఇవి.
7. కుక్క సీన్లు అన్నీ. ముఖ్యంగా కుక్క బెలూన్ల కుర్రాడి గురించి కృతజ్ఞతా భావంతో "నువ్వు మనిషివి కాదు మాస్టారూ... కుక్కవి" అన్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు.
సంగీతం: గోదావరికి కె.ఎం.రాధాకృష్ణన్ ఇచ్చిన సంగీతం ఈ రోజుల్లో వచ్చే సంగీతానికి భిన్నంగాను నాలుగు కాలాలు నిలిచేదిగానూ ఉంది. 'గోదావరి' సంగీతం 'ఆనంద్'కి స్టీరియోటైపులా ఉందని భావించేవారు ఉంటే ఉండొచ్చు గాక, మిగతా చాలా సినిమాల సంగీతం కంటే ఎంతో ఉన్నతంగా, చెవులకు సుఖంగా, హాయిగా ఉంది. అసందర్భపు పాట ఒకటి కూడా లేదు. 'మనసా వాచా', 'అందంగా లేనా' పాటలు మొదటిసారి విన్న వెంటనే నచ్చేట్టు ఉంటే మిగిలినవి నెమ్మదిగా, విన్నకొద్దీ నచ్చుతాయి. 'రామచక్కని సీత' నేపథ్యంలో వినిపిస్తూంటే గోదావరి మీద సీతా, శ్రీరాంల కెమిస్ట్రీ కలిగించే అనుభూతి మనం కూడా పడవ మీద భద్రాచలం వెళ్ళొద్దామా అనుకునేంత అందంగా ఉంది (అంటే ప్రతి ఒక్కరికీ అలా హీరో లేక హీరోయిన్ తారసపడరని గమనించ ప్రార్థన) .
డబ్బింగ్:సునీత తన గొంతు అరువివ్వకుంటే సీత పాత్ర అసంపూర్ణంగా ఉండిపోయేదేమో. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎంతసేపైనా వింటూనే ఉండవచ్చనిపిస్తుంది.
రంధ్రాన్వేషణ:
- గోదావరి అందాలు అంటే గుర్తొచ్చేది ముందుగా వంశీయే. కథలో భాగంగా గోదావరి అందాలు ఇమిడిపోతాయి వంశీ సినిమాల్లో. ఈ విషయంలో 'గోదావరి' వంశీ సినిమాలకంటే గొప్పగా కాకున్నా, దాదాపు అంత బాగానూ ఉంది. ఎక్కువ భాగం లాంచి మీదే తీయడం వల్ల లాండ్ స్కేప్ చిత్రీకరించే అవకాశం ఎక్కువగా లేకుండాపోయింది దర్శకుడికి. ప్రేక్షకులు కూడా సీత - శ్రీరాం - రాజి పాత్రల నడుమ చిక్కుకుపోయి చుట్టూ ఏం జరుగుతోందో పెద్దగా పట్టించుకోరు.
- వీరయ్య, అతని కూతుర్ని శ్రీరాం రక్షించే సన్నివేశం అనవసరమనిపిస్తుంది.
- సినిమా చరమాంకంలో బిగి సడలిపోతుంది. 'ఆనంద్'లో కూడా ఇదే లోపం ఉన్నప్పటికీ ఆ సినిమా మీద అంత అంచనాలు లేకపోవడం వల్ల అంత పెద్ద లోపమనిపించదు. గోదావరి ఇంటర్వెల్ సమయానికి అంతులేని అనుభూతుల సమాహారంలో మునిగితేలిన ప్రేక్షకులకు క్లైమాక్స్ కాస్తా ఒక పోస్ట్ మార్టం లా కనపడుతుంది. మరీ సినిమాటిగ్గా ఉండకూడదని కాబోలు దర్శకుడూ ఈ శైలిని ఎంచుకున్నాడు. కానీ ముగింపు బలంగా లేకపోతే మొత్తం అనుభూతి పలచబడిపోయే ప్రమాదం ఉందని దర్శకుడు గమనిస్తే మంచిది. ఏ సినిమాకైనా మొదలు కన్నా ముగింపు బావుండడం తప్పనిసరి.
చివరగా...మొత్తం మీద గోదావరి ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నిటిలోకి చాలా మెరుగైన చిత్రం. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ కుటుంబసమేతంగా చూడదగిన చక్కటి చిత్రం.
కొసమెరుపు: 'పోకిరి'లాంటి సినిమా చూసిన మరుసటి రోజే చూస్తే 'గోదావరి' ఇంకా బావుంటుంది. జస్ట్ ఒక ఉచిత (బోడి)సలహా సుమండీ. 'పోకిరి' రివ్యూ త్వరలో రాస్తాను.
8 Comments:
ayyayyooo... mari nenu pokiri chusesaanu... ippudelaaa ;)
ఏమిటండి మీరు, నేను 'గోదావరి' మీద రివ్యూ రాద్దామనుకుంటే మీరు రాసేశారు. అయినా సరే... నేను ఒక రివ్యూ రాస్తున్నాను నా బ్లాగులో... కొంచెం మీ రివ్యూలా ఉంటే నా తప్పు లేదు... క్షమించండి.
నాకు క్లైమాక్స్ కూడా నచ్చిందండి బాబు...
నిజంగా కొసమెరుపు కేక....
పోకిరి గురించి కూడా రివ్యూ రాయండి. లేక పోతే నేను రాసేస్తాను.
రాజు
చాలా చక్కగా రశారు, ఇంకోసారి సినిమా చూసినట్టు, చూడాలని అనిపించేట్టు.
అందమైన కవితలన్నీ దృశ్యాలైతే అది గోదావరి సినిమా.
అలాంటి హీరో హీరొఇన్లు శెఖర్ కాబట్టి సృష్టించారు.
మనసుకి హత్తుకోవటం అంటే నిర్వచనం గోదావరి చూస్తే తెలుస్తుంది.
Super review.
I saw this movie 18 times in the theatre.Antha nachindi naku.ippatiki tv lo vaste vadalanu
i'm still waiting for Pokiri reviw...
చాలా రోజుల తర్వాత అనుకోకుండా గోదావరి రివ్యూ కనిపించిందండి మీ బ్లాగ్ లో ...ఈ ఒక్క రోజే ఇప్పటికీ దాదాపు ఓ పది సార్లు చదివుంటానండి ఈ రివ్యూ...ఈ సినిమా నాకు ఎంతబాగా నచ్చిందో వర్ణించలేను..కానీ ఇంకో పది సార్లు చదువుతా మీ రివ్యూను...
కృతజ్ఞతలండి ఓ గొప్పసినిమాను మీ వర్ణనతో మరింత అందంగా వర్ణించినందుకు ...ఇప్పుడున్నవాళ్ళలో శేఖర్ కమ్మల గారి గొప్పదర్శకుడు అనాల్సిందే...అని తీరాల్సిందే...
చాలా రోజుల తర్వాత అనుకోకుండా గోదావరి రివ్యూ కనిపించిందండి మీ బ్లాగ్ లో ...ఈ ఒక్క రోజే ఇప్పటికీ దాదాపు ఓ పది సార్లు చదివుంటానండి ఈ రివ్యూ...ఈ సినిమా నాకు ఎంతబాగా నచ్చిందో వర్ణించలేను..కానీ ఇంకో పది సార్లు చదువుతా మీ రివ్యూను...
కృతజ్ఞతలండి ఓ గొప్పసినిమాను మీ వర్ణనతో మరింత అందంగా వర్ణించినందుకు ...ఇప్పుడున్నవాళ్ళలో శేఖర్ కమ్మల గారి గొప్పదర్శకుడు అనాల్సిందే...అని తీరాల్సిందే...
Post a Comment
<< Home